మహారాణిశ్రీ మామ్మకి నీ మనవడు రవి అమెరికా నుండి వ్రాయు నమస్కరించి లేఖార్ధములు...
ఇచ్చట అంతా
క్షేమము. మీరు అంతా క్షేమం అని తలుస్తాను. కామేశ్వరి అత్తకు నా నమస్కారములు. ఇవాళ మార్చి పన్నెండవ తారీఖు. హోళి పూర్ణిమ. ఇవాల్టికి మేము అమెరికా చేరి మూడునెలల ఎనిమిది రోజులు. ఇవాల్టి వరకు ఇక్కడి అనుభవాలను ఈ లేఖ ద్వారా నీకు తెలుపదలచి, ఎన్నో రోజులుగా దాటవేసి చివరికి ఇవాళ రాయటం మొదలు పెట్టాను.
ఆ వివరాలలోనికి వెళ్ళే ముందు, ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తాను. ఇక్కడకి వచ్చిన మొదటి వారం
నుండి ఇక్కడ వంట ప్రారంభించింది శైలజ. మన భోజనమే చేస్తున్నాము. ఇంట్లో వండిన భోజనమే తింటున్నాము. అప్పుడప్పుడు బయట భోజనం చేస్తున్నాం. ఇక్కడ మాకు మా కంపెనీ వసతి సదుపాయం ఇస్తుంది ఇక్కడ పని చేసినంత కాలం (గరిష్టంగా ఒక సంవత్సరం). ఇల్లు వెతుక్కోవల్సిన పని లేదు. ఇక్కడి వాతవరణం చాల చల్లగా ఉంది. అందులోను మేము ఇక్కడికి - ఇక్కడి చలి కాలంలో వచ్చాము. మన దగ్గర చలి కాలం కనిస్ట ఉష్ణోగ్రత 15-20 ఉంటే ఇక్కడ -10 (మైనస్ పది) వరకు మేము చూసాము. ఐతే అది కొద్ది రోజులు మాత్రమే. సాధారణంగా 10 డిగ్రీలకు అటు ఇటుగా ఉంటోంది.
శైలజ
మరియు వైష్ణవి -- హోటల్ గదిలోనె ఉండిపోతున్నారు. ఎప్పుడైన వెచ్చగా ఉంటే బయటకి వస్తారు. నాకు ఆఫీసు హోటల్ ఎదురుగానే ఉన్న కారణం చేత నేను నడిచి వెళ్ళి వస్తున్నా. అలా నాకు ఇక్కడి చల్లదనం బాగానే అలవాటు అయింది. పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇంక మా అందరి ఆరోగ్యాలు చక్కగా ఉన్నాయి. భగవత్కృప వల్ల ఎవ్వరికి (ఒకటి రెందు సార్లు కొంచము జలుబు మినహా) ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. బయటకి ఎక్కడికైన వెళ్లాలి అంటే కారు అద్దెకు తీసుకోవాలి. అది కంపెనీ భరిస్తుంది. ఇక్కడి ఫొటోలు బాబుకి పంపుతున్నాను. నీకు చూపించారని ఆశిస్తున్నాను. ఇలా దైనందిన జీవితంలో అవసరాలు అన్ని సక్రమంగానే నడుస్తున్నాయి. వసతి, భోజనం, ఆఫీసు, వాతావరణం మరియు రవాణా - అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి.
ఇక మిగతా వివరాలు –
చిన్మయ శ్రీ వైష్ణవి
ఇక్కడకి వచ్చేముందు మాకు
ఉన్న మొదటి టెన్షన్ విమానంలో దాదాపు ఇరవై గంటల ప్రయాణం - పాప ఎలా ఉంటుంది అని. వైష్ణవి ఎంత మంచి పిల్ల అంటే - మా మొత్తం ప్రయాణంలో అసలు అల్లరి పెట్టనే లేదు. మొదటి విమానం హైదరాబాదు నుండి దుబాయి. అది మొత్తం 5 గంటల ప్రయాణం. రాత్రి విమానం అవ్వటంవల్ల మొత్తం అంతా పడుకునే ఉంది వైష్ణవి. దుబాయి లో మేము విమానం మారాలి - అక్కడ ఒక రెండు గంటల నిడివి ఉంది. ఆ సమయంలో ఒక విమానం నుండి రెండవ విమానం లోనికి మారాలి. విమానంలో మనతో ఉండవలసిన బ్యాగులు - విమానంలో అవసరమయ్యే పాప పాల డబ్బాలు, ఇతరత్రా వస్తువులు ఉన్న బ్యాగులు మన దగ్గర ఉంచుకుంటాము. మిగతా లగేజి (అమెరికా చేరిన తర్వాత ఉపయోగించే వస్తువులు - బట్టలు, ఇతరత్రా) విమాన సిబ్బంది మారుస్తారు.
దుబాయి చేరాక పాప
లేచింది, మళ్ళీ కొద్దిసేపటికి పడుకుంది. విమాన సిబ్బంది అందరికి ఇది ముద్దే. విమానంలో ఎయిర్ హోస్టెస్ లు అటు ఇటు తిరుగుతూ పాపని పలకరించటం, ఆడుకోవటం ఇలా సాగింది. విమానంలో నా పక్క సీటులో మనిషి - ఒక 50 యేళ్ళ పాకిస్తానీయుడు. చాల మర్యాదస్తుడు ఆయన. పాపతో పక్క సేట్లో ఉన్న నేను అతనిని చాలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది - పాప కోసం మాటి మాటికి లేవటం (ఎత్తుకుని తిప్పటానికి), పాప అరుపులు - ఇవన్నీ నవ్వుతూ భరించాడు. తన మనవల గురించి చెప్పాడు. అతను పాకిస్తాన్ రైల్వేస్ లో పని చేస్తాడంట, అమెరికా లో ట్రైనింగ్ నిమిత్తం వెల్తున్నాడు. అమెరికాలో బోస్టన్ లో మేము దిగి మరొక విమానం ఎక్కాలి - రిఛ్మండ్ చేరేందుకు. అన్ని చోట్ల క్యూలలో మాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు చిన్న పాపతో ఉన్నందున. అలా దాని (వైష్ణవి) వల్ల మాకు అసౌకర్యం బదులుగా అతి సౌకర్యం దొరికింది.
ఇక్కడ (రిఛ్మండ్) చేరిన తర్వాత హోటల్ లో
పాప కోసం ఒక బుజ్జి మంచం లాంటిది ఇచ్చారు. ఇక్కడకి వచ్చిన మూడవ వారం - దాని పుట్టినదినం. ఒక కోవెల ఉంది ఇక్కడ - సర్వ దేవతా సముదాయం. అక్కడకి వెళ్ళాము - ఇక్కడ నా సహోద్యోగులతో జన్మదిన వేడుక జరిపించాము. అందరికి ముద్దే ఇక్కడ కూడా. ఈ మూడు నెలలలో పాప ఎదుగుదల ఆరోగ్యంగా ఉంది. ముందుగా నడక ప్రారంభమైంది. ఇప్పుడు పరుగులు తీస్తోంది. పడుతోంది, లేస్తోంది, పరుగెడుతోంది.
ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటం వల్ల
ఇక్కడ ఇళ్ళన్నీ కలపతో చేస్తారు - వెచ్చదనం కోసం. అలాగే గచ్చు కూడా మొత్తం చెక్కతో ఉండి, దానిమీద మందంగా ఉన్న కార్పెట్ ఉంటుంది. దానివల్ల పాప ఎన్నిసార్లు పడ్డా అస్సలు దెబ్బ తెలియదు దానికి. అలా నొప్పి లేకుండ నడక నేర్చేసుకుంది. మాకు ఇది చాల ఆనందాన్ని కలిగించే విషయం. అల్లరి మోతాదు పెంచింది. అరవటం , పిలవటం - అమ్మ, నాన్న, తాత, దాత, అత్త, మామ్మ, అమ్మమ్మ, అక్క, అన్న - ఇవి ఇప్పటికి అది పలకగలుగుతోంది. వీటితోపాటు పలకరింపుగా గోదావరి జిల్లా వారి యాసలో అన్నట్టు "ఆయ్" అంటుంది ముద్దుగా. లైటు ఏది అంటే చూపిస్తుంది. పాటలకి డాన్సు చేస్తుంది. ఏదో గెంతుతుంది.
దీనికి నిద్ర పుచ్చటానికి "రామ
రామ" అని అంటూ జోకొట్టటం అలవాటు. ఇప్పుడు మేము రామ అని అంటే వెళ్ళి దాని చిన్న తలగడ తెచ్చుకుని, నేల మీద పెట్టి - పడుకుని - మనవైపు నవ్వుతూ చూస్తుంది. దీని పుణ్యాన రోజులో వేయిసార్లు అయినా రామ అని అంటున్నామేమో మేము. ఎత్తు బరువు ఎదుగుదల ఆరోగ్యంగానె ఉన్నది. ఉదయం నిద్ర లేచిన తర్వాత మధ్యాన్నం 2 వరకు ఆడుకుని ఒక గంటన్నర పదుకుంటుంది, మళ్ళీ రాత్రి 9-10 కి పడుకుంటుంది. మా హొటల్ రూము శుభ్రం చేయటానికి వచ్చే హొటల్ సిబ్బందిని (ప్రతి రోజు వస్తారు) చూస్తునే నవ్వుతుంది, వాళ్ళు కూడా నవ్వుతారు. ఇంక ఎవేవో మాటలు చెప్తుంది - ఎదొ అర్థమయ్యినట్టు వాళ్ళు కూడా ఏదో శబ్ధాలు చేస్తారు. ఇలా ఉంది దాని దిన చర్య. ఇంచుమించు రోజు నాన్న వాళ్ళతో ఫోనులో వీడియో కాలు (ఇదివరకు ఫోనులో మాట్లాడినపుడు గొంతు వినబడేది - ఇప్పుడు మనం కనబడతాము కూడా - దీనిని వీడియో కాల్ అంటారు) మాట్లాడుతున్నాము.
అన్నయ్యతో మాట్లాడినప్పుడు శ్రీహాస, శ్రీఅనిరుధ్ -- ఇద్దరూ వైష్ణవి ని
"వైషు మాత - వైషు మాత" (వదిన పెట్టిన ముద్దుపేరు) అని ప్రేమతో పిలుస్తారు - వైష్ణవి వాళ్ళని చూస్తేనే నవ్వేస్తుంది. ఇలా దాని గురించి ఏం చెప్పినా ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నా సహోద్యోగులు కూడా దాన్ని పలకరించటానికి వస్తారు.. దాని పుట్టినరోజున దానికి ఇక్కడ వాళ్ళు బొమ్మలు కొని ఇచ్చారు. మా మేనేజరు (పేరు షెర్రి - చాల మంచావిడ) కూడా వచ్చి ఆశీర్వదించారు పుట్టినరోజున.
దాని
పుట్టుజుత్తు మూడవ ఏడు చేయాలి. ఇప్పుడు జుట్టు బాగా పెరిగింది. మరొక రెండు నెలల్లో బహుసా జడలు వేయటం ప్రారంభించవచ్చు. ఇండియా వచ్చిన వెంటనే నీ దగ్గరకి తీస్కుని వస్తాను, అలాగే దాని పుట్టుజుత్తులు కూడా తీయించాలి (మన అలవాటు ప్రకారం తిరుపతిలో). ఇంక దాని తిండి - మనం ఏమి పెడితే అది తినేస్తుంది. మేము అన్నం పెట్టటం బాగానే అలవాటైంది దానికి, ఏ కూర అయినా తినేస్తోంది. తీపి, పులుపు, ఖారం - ఇలా అన్ని (ఖారం తక్కువ మోతాదులోనే పెడుతున్నాం). పండ్లు కూడా బాగే తింటోంది - ముఖ్యంగా ద్రాక్ష. పైన నాలుగు కింద 3 పళ్ళు వచ్చాయి దానికి. నమిలి తింటోంది. ఇది సంక్షిప్తముగా చిన్మయ శ్రీ వైష్ణవి విశేషాలు.
ఇక్కడి నా ఆఫీసు పని
ఇక్కడ నా
పని కూడా చాల సజావుగా సాగుతోంది. ఇక్కడి ఉద్యోగులు, నా సూపర్వైసరు అందరూ మంచివాళ్ళే. వచ్చిన రెండవ రోజున మొహిందర్ అనే మరాఠి అబ్బాయి పప్పులు, బియ్యం, కూరలు కొనుక్కునేందుకు తనే స్వయంగా అడిగి కారులో తీస్కెల్లాడు. ఇప్పటికి వాళ్ళతో వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ కారు లేకుంటే ఏమి చేయలేము. పనిలో కూడా నా పై అధికారి సహకారం బాగానే ఉంటోంది. ఇక్కడి మనుషులు స్వార్ధపు ముసుగులో ఉన్నట్లు అనిపించదు. నా ఆఫీసు పని ఉదయం తొమ్మిదికి ప్రారంభం. నేను ఉన్న హోటల్ కి - రోడ్డు కి అవతలే నా ఆఫీసు. నేను తొమ్మిదికి హోటల్ నుండి ప్రారంభం ఐతే నా ఆఫీసు గదికి 8 నిమిషాలలో చేరిపోతాను. మధ్యాన్నం పన్నెండుకి మధ్యాన్న భోజనం కోసం ఇంటికి వస్తాను. మళ్ళీ ఒంటిగంటకి తిరిగి ఆఫీసుకు వెళ్తాను. మళ్ళీ సాయంత్రం ఆరింటికి పని ముగించి హోటల్ కి వెళ్ళిపోతాను. అప్పడప్పుడు ఒక గంట ఆలస్యం ఐతే ఔతుంది.
ఇంక
ఇంటికి వచ్చాకా హైదరాబాదులో అయితే సమయం దొరకదు కాని, ఇక్కడ పాపతో ఆడుకోవటానికి చాల సమయం ఉంటుంది. ఆఫీసులో వచ్చిన మొదటి రెండు వారలలో పై అధికారి నుండి మెచ్చుకోలు వచ్చింది నా పనికి. అంతా సవ్యంగా నడిస్తే - ఈ మిగిలిన తొమ్మిది నెలలు కూడా నేను ఇక్కడే పని చేస్తా. ఒకవేళ ఇక్కడ పని ముగిస్తే (అవకాశం తక్కువ) - మరో ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది నా పనికి సంబంధించిన విశేషాలు. నాతో పాటు ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు నా బృందంలో ఉన్నారు.
ఇంకా ఇక్కడి వాతావరణం
నేను
ఉన్న నగరం - రిఛ్మండ్ - అమెరికా తూర్పు తీరంలో ఉంది. ఇక్కడ తూర్పుతీరంలో ఉత్తరానికి వెళ్తే - చల్లదనం పెరుగుతూ పోతుంది. నేను ఉన్న నగరం మన సాధారణ ఉష్ణోగ్రతకి ఒక 10 డిగ్రీలు తక్కువ ఉంటుంది. మా నగరానికి దక్షిణానికి ఫ్లోరిడా రాష్ట్రంలో మన లాగనే ఉంటుంది. అంచేత నా ఉద్దేశం నాకు ఇక్కడ రావటం అదృష్టమే. ఉత్తరాన వచ్చి ఉంటే చాల అసౌకర్యం ఉండేది. వైష్ణవికి కూడా కష్టం అయ్యేదేమొ. ఇక్కడ అంతా కరెంటు మీద నడుస్తుంది. ఆఖరుకి వంట చేస్కొనే పొయ్య కూడ కరెంటు తోనె. నిన్న ఇక్కడ ఒక రెండు గంటలు కరెంటు పోయింది. మాకు తిండి ఎలా తినాలో అర్థం కాలెదు. సాధారణంగా ఇక్కడ పోదు. తుఫాను వల్ల ఎక్కడో కనెక్షను పోయి కరెంటు పోతె, గది చల్ల బడిపోయింది. ఎందుకంటే ఇక్కడ బయట 0-4 డిగ్రీలు ఉంటే, గదిలో ఏ సి వేస్కుని 23-25 డిగ్రీలు పెట్టుకుంటాం. ఇక్కడ కరెంటు పోతే, ఏ సి పోయి - మనం మంచుముక్కలా అయిపోతాము. కానీ ఈ మూడు నెలలలో ఇదే మొదటి సారి కరెంటు పోవటం.
ఇక్కడి పద్ధతి
ఇది
నాకు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడి మనుషులు ఎంతో ఆప్యాయంగా, బంధువుల మాదిరి మాట్లాడుతారు. నీవు రోడ్డు మీద నడుస్తుంటే ఎదురు వచ్చే వాళ్ళు - నీకు పరిచయం లేకున్నా "హల్లో - బాగున్నారా" అని పలకరిస్తారు ఇంగ్లీషులో. తుమ్మితే మనం చిరంజీవ అన్నట్టు వీళ్ళు ఇంగ్లీషులో ఆశీర్వదిస్తారు. రోడ్ మీద నడిచే వారికి - వాహనాలలో వెళ్ళేవాళ్ళు గౌరవిస్తారు - రోడ్ దాటుతుంటే ఆగిపోతారు. పూర్తిగా సంస్కారవంతులు అనిపిస్తుంది.
రోడ్డు మీద
చెత్త కనబడదు. ఇలా చాలా విషయాలలో మర్యాదస్తులుగా నడుచుకుంటారు. అబద్ధం ఆడటం ఇప్పటికి నేను గమనించలేదు. (ఇపుడు నేను చెప్పింది అంతా ఇక్కడ ఇప్పటివరకు నేను చూసిన వారిని గమనించి చెప్తున్న మాటలు) వీరు మద్యం సేవించటం (వాతవరణం దృష్ట్యా ఉన్న అలవాటు కావచ్చు) అనేది తప్ప మన ఆలోచన సరళిని అనుసరించి వీరిలో తప్పు పట్టే గుణం లేదు. సహాయనికి వెనుకాడరు. జీవితాన్ని జీవించటంలో ఉన్న మక్కువ ఎక్కువ. రేపటికోసం దాచుకొవాలి అనేది ఉన్న, ఇవాల జీవించాలి అనే దృక్పథం ఎక్కువ ఉంది.
అయితే అన్నీ మంచి
లక్షణాలున్న వారిని మాత్రమే నేను కలవటం అనేది జరిగి ఉండవచ్చు. ఏమైనా మనం నేర్చుకొవల్సిన విషయాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఒక చిన్న అవలక్షణం చూసా. అది దుబార చేయటం. ఇక్కడ నేను కారు, బస్సు, రైలు, విమానం - వీటన్నిటిలో ప్రయాణించాను. ఇక్కడి మనుషులు శుభ్రతకి, సుఖానికి, ప్రశాంతతకి, క్రమశిక్షణకి ఇచ్చిన ప్రాధన్యం చూస్తే ముచ్చటేసింది. చరిత్ర పట్ల, వారి వీరుల పట్ల ఉన్న గౌరవం అభినందనీయం.
ఇక్కడ ఇప్పటి వరకు చూసిన ప్రదేశాల విశేషాలు -
ఇక్కడే రిఛ్మండ్ లో
- ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. రకరకాల పూల మొక్కలు ఉంటాయి. మేము క్రిస్త్మస్ రోజుల్లో వచ్చాము కదా, అప్పుడు ఆ పార్క్ లో లైట్లతో బాగా ఆకర్షణీయంగా చేశారు. అది చూసాం. అలాగే ఈ ఊరిలో జేంస్ నది ఉంది. ఆ నది పైన దాటడానికి ఉన్న బ్రిడ్జి కింద నడుచుకుని వెళ్ళేవాళ్ళ కోసం ఇంకొక పాదచారుల బ్రిడ్జి ఉంది. అక్కడికి వెళ్ళాము. నీటికి దగ్గరగా వెళ్ళలేక పోయాము. మరో పార్కు - ఎకో పార్కు - ఉంది, అక్కడకి వెల్లాము. అలాగే ఇక్కడ హిందు సెంటర్ ఆఫ్ వర్జీనియా (వర్జీనియా రాష్ట్రం పేరు) అని ఒక పెద్ద దేవాలయ ప్రాంగణం ఉంది. అక్కడికి ఒక రెండు సార్లు వెళ్ళాము. రెండు షాపింగ్ మాల్స్ కి వెళ్ళాము.
మా
హోటల్ నుండి ఒక యాభై మైళ్ళ దూరంలో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. అక్కడికి నా స్నేహితుడు మొహిందర్ తీసుకుని వెళ్ళాడు. అలాగే ఇక్కడ ఒక జూ (జంతు ప్రదర్శన శాల) ఉంది. అక్కడకి వెళ్ళాము. చాలా దేశాల నుండి తెప్పించిన జంతువులు ఉన్నాయి. మన దేశం నుండి తెప్పించిన బెంగాల్ టైగర్ వారి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. కంగారు, నిప్పు కోడి, రకరకాల పాములు, కోతులు, పక్షులు, జిరాఫి, దుప్పులు, లేళ్ళూ, ఒంటె, పెంగ్విన్, నెమలులు ఉన్నాయి. ప్రధాన విశేషం ఏంటి అంటే - అక్కడ మేము భోజనం చేసే సమయంలో ఒక నెమలి పురి మొత్తం విప్పి దాదాపు అరగంట సేపు ఆడింది. వీడియోలు, ఫొటోలు తీస్కున్నాం. జిరాఫి కి దాని ఆహారం తినిపించాం, కొన్ని పక్షులకి వాటి ఆహారం తినిపించాం.
నూతన
సంవత్సరాన నా స్నేహితుడు మొహిందర్ ఇంట్లో చాల మంది స్నేహితులతో గడిపాము. మొహిందర్ కి గత సంవత్సరమే పెళ్ళైంది. అతని భార్య - చేతన - మంచి అమ్మాయి. శైలజ తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు - వైష్ణవి తో ఆడుకోవటం కోసం. అన్నట్టు మర్చిపోయా - వైష్ణవి పుట్టినరోజున మా హోటల్ గదిని వాళ్ళే అలంకరించారు మొహిందర్ అతని భార్య వచ్చి.
సంక్రాంతి పండగకి మా
ఊరి నుండి 6 గంటల రైలు ప్రయాణం చేసి - కవిత అని విప్రో లో పని చేసినప్పటి నుండి తెల్సిన ఒక అక్క ఇంటికి వెళ్ళాము. కవిత అమ్మ గారు జొన్నలగడ్డ వారు. కవిత తల్లితండ్రులు అమెరికా వచ్చారని తెలిసి, భోగి నాడు పాపకి కూడా భోగిపల్లు పోసి ఆశీర్వదిస్తారని వెళ్ళాము. కవిత కి కూడ మూడు నెలల కూతురు ఉంది అపుడు. భోగిపళ్ళు ఏర్పాట్లు చేశారని తెలిసి, వెళ్ళాము. బాగా జరిగింది. అక్కడి నుంది కనుమ నాటికి అన్నయ్య తోడల్లుడు రామకృష్ణ యడవల్లి గారి ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అమ్మాయి వైష్ణవితో చాల సేపు ఆడుకుంది. వీరందరి ఆతిధ్యం బాగుంది. అలా ఫిలడెల్ఫియా నగరం కొంచం చూసాం.
ఆ తర్వాత మళ్ళీ గత నెల లో వాషింగ్టన్ వెళ్ళాం. మా ఊరినుండి అది 100 మైళ్ళు. రెండు గంటలు ప్రయాణం ఇక్కడి నుండి. అక్కడ పొడగట్లపల్లి వారి కుటుంబం ఉంది. వాళ్ళు అప్పట్లో వైజాగ్ లో పెదమావా వాళ్ళ ఇంటి లోగిలిలో ఉండేవారు. దశమి నాడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంటే, వెళ్ళాము. అక్కడ వైట్ హౌస్, లింకన్ మెమోరియల్, పార్లమెంట్ భవనం (క్యాపిటల్ బిల్డింగ్ అంటారు ఇక్కడ), రెండవ ప్రపంచ యుద్ధ స్మారకం, వాషింగ్టన్ మెమోరియల్ - వీటిని చూసాం.
ఇక్కడికి వచ్చాక దొరికిన సమయం వల్ల - సాయంత్రం కూడా స్నానం తర్వాత పూజ చేస్కుంటున్నాను. సంధ్యావందనం కూడా ప్రారంభించాలని ఉంది.
నీకు ఉత్తరం రాయటం మొదలు పెట్టి అపుడే వారం పైన అయింది. వీలు చిక్కినప్పుడు రాస్తున్నా. గత వారం ఒక కారు అద్దెకు తీస్కుని నడిపాను. ఇవాలే ఇంకొక కారు అద్దెకు తీస్కున్నా. శని, ఆదివారాలు తీస్కుని సోమవారం తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ ఖర్చు కూడా కంపెనీ భరిస్తుంది. నీకు ఇప్పటి వరకు రాసిన ఉత్తరంలో నేను నీకు చెప్పటం మరిచిపోయాను. అదేమిటంటే ఇక్కడికి నేను రాక మూడు నెలల ముందు హైదరాబాదు నుండి, నా ఆఫీసు నుండే మరో అబ్బాయి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చాక అవసరమైన సమాచారం అంతా ఆ అబ్బాయే ఇచ్చాడు. పేరు ఆశీష్ బాలచందాని. భోపాల్ అబ్బాయి. పెళ్ళి కాలేదు. మేము ఉన్న హోటల్ లోనే మరో గదిలో ఉంటున్నాడు. ఇక్కడి అన్ని పనులకి అవసరమైన సహాయం, సహకారం ఇస్తున్నాడు. వాడు కూడా శాఖాహారి, కాబట్టి మనకి కావల్సిన భోజన సదుపాయాలు గురించి, జాగ్రత్తల గురించి, తనే చెప్పాడు. బాబు, పిన్ని వాళ్ళతో కూడ నేను మాట్లాడుతున్నను, ఇక్కడి విశేషాలు తెలియజేస్తున్నను. బాబు మన ఊరిలో శివ కేశవ ఆలయాల పనులు, వాటి ప్రగతి, ప్రారంభోత్సవం గురించి చెప్పారు. ఫొటోలు పంపారు. రఘు తోను, రవళి తోను, అనిల్ బావగారితోను కూడా మాట్లాడుతున్నాను.
ఇవీ విశేషాలు. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ఉత్తరం రాస్తాను. ఇంతే సంగతులు. మీ నూతన సంవత్సరాది ఆశీస్సులు ఆశిస్తూ, సెలవు.
ఉగాదికి ఏ ఆలయం కి వెళ్ళాలా అని అలోచన. చూడాలి. అన్నట్టు - నీకు మా అందరి నుండి, శైలజ నుండి- ముఖ్యంగా నీ మునిమనవరాలు చిన్మయ శ్రీ వైష్ణవి నుండి - ఉగాది మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఇట్లు
నీ రవి
1 comment:
Chinnappudu Telugu textbooks lo intha manchi chakkani telugu ni chusaanu..malli ipudu ivalla mee lekhani chusthunnanu. Mee anubhavaalanni chalaa vivaramgaa ekkada kuda bore lekunda chala manchiga varninchaaru. oka manchi telugu text book chaduthunna feel vachindi. na school days gurthochaai. Idi meeru post chesthey chala entho mandiki chala manchi gnaapakaalni, feel ni isthundii anipisthundi. Nakaithey chaduvthunna prathi word lo meeru descibe chesinadantha kallaku kattinatlundi. chalaaaa nachindii... naku share chesinanduku chala chala dhanyavaadamulu Viswa garu
Post a Comment